prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 11:50 am Digital Edition : PRAJA VANI

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా!

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై 66వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్

హసన్‌పర్తి, నవంబర్ 25, మన ప్రజావాణి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హసన్‌పర్తి 66వ డివిజన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి అర్హులైన కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ప్రతి అర్హులైన కుటుంబానికి పథకం వివరాలు చేరాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని గొర్రె కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనాలు పొందేలా సహకరించాలని సూచించారు.

ప్రజల కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.