పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
పస్రాలో ఈ నెల 28న నిర్వహణ.. ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం ఏర్పాటు
మంగపేట, నవంబర్ 25 (ప్రజావాణి):
ఈ నెల 28వ తేదీ శనివారం పస్రాలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు వైద్య సేవలు అందించనున్నారు. మంగపేట మండలంలోని 25 గ్రామాల ప్రజలు, గిరిజన గూడేల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంగపేట ఎస్ఐ మధుకర్ కోరారు. వైద్య శిబిరానికి వెళ్లే ప్రజల కోసం మంగపేట పోలీస్ శాఖ తరఫున ఉచిత రవాణా సౌకర్యంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కల్పిస్తున్న ఈ సౌకర్యాలను వినియోగించుకుని పెద్ద సంఖ్యలో వైద్య శిబిరానికి హాజరుకావాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.