పాలేరు అవుట్‌ఫాల్ కాలువ వద్ద పొంచి ఉన్న ప్రమాదం!
25 అడుగుల లోతులో కాలువ.. రక్షణ గోడలు లేక ప్రయాణికుల ఆందోళన
ప్రమాదం జరిగాక స్పందిస్తారా.. ముందే చర్యలు తీసుకుంటారా?
కూసుమంచి నవంబర్ 25 (మన ప్రజావాణి) ప్రతినిధి:
ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిపై ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ అవుట్‌ఫాల్ కాలువ వద్ద రక్షణ గోడలు లేకపోవడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి పక్కనే సుమారు 25 అడుగుల లోతులో కాలువ ఉండటంతో ఏమాత్రం వాహనం అదుపుతప్పినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోంది. కాలువకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో కాలువను గుర్తించలేక వాహనాలు అదుపుతప్పితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాయకన్‌గూడెం బస్సు ప్రమాదం ఓ హెచ్చరిక!
గతంలో నాయకన్‌గూడెం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఇప్పటికీ ప్రజలను కలవరపెడుతోంది. 2016 ఆగస్టు 22న జరిగిన ఈ ప్రమాదంలో బస్సు కాలువలో పడటంతో 10 మంది ప్రయాణికులు మృత్యువాత పడగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వారంలోనే అదే ప్రాంతంలో మరో ఆర్టీసీ బస్సు కాలువలో పడటంతో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి రక్షణ గోడల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అయితే, నాయకన్‌గూడెం ప్రమాద ప్రాంతానికి సమీపంలోనే ఉన్న పాలేరు అవుట్‌ఫాల్ కాలువ వద్ద ఇప్పటికీ సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో జరిగిన ప్రమాదాలు అధికారులకు గుణపాఠం కావాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాదం జరిగే వరకు ఎదురుచూస్తారా?
ప్రాణనష్టం జరిగిన తర్వాత హడావుడిగా స్పందించడం కంటే ముందుగానే ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరు అవుట్‌ఫాల్ కాలువకు ఇరువైపులా పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలని, రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించే రేడియం ప్రమాద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
