క్రీడలతో యువతలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయి
దీక్షా దివస్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 25:
దీక్షా దివస్‌ను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.
ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి ఒక జట్టు, పెద్దపల్లి నుంచి మరో జట్టు పాల్గొన్నాయి. ఇరు జట్ల మధ్య పోటీ ఉత్సాహభరితంగా సాగింది. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహంగా మైదానంలోకి దిగారు.
దీక్షా దివస్ సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని, యువత ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమములో ఉప్పు రాజ్కుమార్ మార్కు లక్ష్మణ్ వెన్నం రవీందర్ సాలెంద్ర రాములు చంద్రశేఖర్ కసిపాక వాసు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు