*కార్తీక జ్యోతుల వెలుగులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం*
రాయికల్, నవంబర్ 24(ప్రజావాణి ప్రతినిధి)
రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని నల్లగుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఆలయ అభివృద్ధి నిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుని, పిల్లలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తితో వేడుకున్నారు. గుట్టపై భక్తుల కోలాహలం, మంత్రఘోష, దీపకాంతులతో ఆలయ ప్రాంగణం దివ్యశోభను సంతరించుకుంది.అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం ఆలయ అభివృద్ధి నిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. వందలాది దీపాల వెలుగులతో నల్లగుట్ట కార్తీక జ్యోతుల వెలుగులో మెరిసిపోయింది.రాత్రి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి శరణు ఘోషతో మెట్టు మెట్టుకు దీపం వెలిగించి నిర్వాహకులు భక్తిని చాటుకున్నారు. ఎల్ నినో ప్రభావం తమ చుట్టుపక్కల గ్రామాలకు రాకూడదని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. చీకటిని తొలగించే దీపం, భక్తిని పెంచే కాంతిగా భక్తులు ఈ వేడుకను ఆస్వాదించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి నిర్వాహక సభ్యులు, గ్రామస్తులు, గ్రామ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.