*ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి*
-ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో అభ్యర్థులకు పిలుపునిచ్చిన మంత్రి సీతక్క.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
గౌరవ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సహకారంతో, ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ తో కలిసి హాజరై అభ్యర్థులను ఉత్తేజపరుస్తూ సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ ఉచిత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విశ్వ అకాడమీ వారిని అభినందించారు. అభ్యర్థులు ఇన్ని రోజులు పడిన కష్టాన్ని పరీక్షలో ఉత్తీర్ణులై చూపించాలని అన్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో మాత్రమే కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కష్టపడాలని పిలుపునిచ్చారు. కష్టపడితే విజయం తప్పక వరిస్తుందని తెలియజేశారు. ఈ పరీక్షలలో విజయం సాధించనంత మాత్రాన నమ్మకాన్ని కోల్పోకూడదని, ఉద్యోగం వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉండాలని, ఒకటి కాకపోతే మరొక ఉద్యోగం వస్తుందని అభ్యర్థులను ప్రోత్సహించారు.
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ మాట్లాడుతూ, ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న దానిని పరీక్షలలో ఉత్తీర్ణులై తమ ప్రతిభను నిరూపించుకోవాలని అభ్యర్థులను ప్రోత్సహించారు. ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఇంకో మూడు రోజుల్లో ఉన్న నేపథ్యంలో చివరి మూడు రోజులు ప్రశాంతమైన వాతావరణంలో రివిజన్ చేస్తూ, ఎటువంటి ఆందోళన లేకుండా, ప్రశాంతమైన మనసుతో పరీక్షకు హాజరుకావాలని సలహా ఇచ్చారు. ప్రిలిమ్స్ ఫలితాల అనంతరం కూడా తోడ్పాటు అందించాలని అభ్యర్థులు కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ, మీరు ఉద్యోగం సాధించే వరకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఆదర్శంగా ఉండాలని, తమ తల్లిదండ్రుల గౌరవ మర్యాదలు కాపాడాలని పిలుపునిచ్చారు.
తదనంతరం విశ్వ ఇన్స్టిట్యూట్ వారు, ఉచిత శిక్షణ అభ్యర్థులు మంత్రిని, జిల్లా ఎస్పీ , డీఎస్పీ లను శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ట్రైనింగ్ డీఎస్పీలు సాయి మహేష్ గౌడ్, సాయి విశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ములుగు సీఐ సురేష్, ఆర్ఐలు స్వామి, శ్రీకాంత్, వెంకటనారాయణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది మరియు ఉచిత శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.
