ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాలను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
09, 31వ డివిజన్లలో నమోదు ప్రక్రియ తనిఖీ.. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనాలు
మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 25:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09, 31వ డివిజన్లలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు కేంద్రాలను మేయర్ దర్ని మధుకర్ సందర్శించి, నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 09వ డివిజన్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో, 31వ డివిజన్లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారం, మార్గదర్శకత్వంతో అమలవుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.
కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే సంపాదనపరుడైన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పిస్తామని, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి పరిహారం అందించడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, నమోదు సమయంలో తమ వివరాలతో పాటు నామినీ వివరాలను కూడా తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని మేయర్ సూచించారు. ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, 09వ డివిజన్ అధ్యక్షులు కొక్కిరాల మోహన్ రావు, మాజీ సర్పంచ్ తెలేటి కిష్టయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.