స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 24:
పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న దాసరి మనోహర్ రెడ్డికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిపారవశ్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవునిపల్లి గ్రామంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.