నంగునూరు, నవంబరు 24:కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వాగులో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన రాజగోపాలపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాతా గ్రామానికి చెందిన బండారి కనకయ్య (73), గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని మంగళవారం ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో గ్రామ సమీపంలోని మోయ తుమ్మెద వాగు చెక్‌డ్యామ్ వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాగు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటనతో ఖాతా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు మృతుడి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనపై మృతుడి కుమారుడు బండారి బిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ టి. వివేక్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.