prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 11:07 am Digital Edition : PRAJA VANI

భక్తులకు కనీస సౌకర్యాలు కరువు..ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం

-భక్తులకు కనీస సౌకర్యాలు కరువు..ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం…?

మన సమగ్ర ప్రజావాణి, పెద్దపల్లి జిల్లా

రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారుతోంది.అయితే భక్తుల రాకకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు,పారిశుద్ధ్యం,రద్దీ నియంత్రణ వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కుటుంబాలతో,వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతున్నారు.భక్తుల ఇబ్బందులు కనిపించడం లేదా…?దేవస్థానానికి భక్తులు భారీగా తరలివస్తున్నప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆలయ కార్యనిర్వహణ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.భక్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువవుతోందని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆదాయమున్న అభివృద్ధి సున్నా…?ఆదాయానికి తగ్గట్టుగా సౌకర్యాలేవీ…..?
దేవస్థానానికి భక్తుల ద్వారా వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతున్నప్పటికీ,ఆ స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యంగా భావించి ఆలయ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత కల్పించాల్సిన ఆలయంలో కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలో రద్దీ నియంత్రణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.