అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు అందిస్తామని భరోసా
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ నవంబర్ 24 (ప్రజావాణి):
కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల నిరీక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెరదించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు నూతనంగా మంజూరైన 812 ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇప్పటికే నాలుగు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేశామని, త్వరలోనే మిగిలిన రెండు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ కూడా చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేదలకు అండగా నిలవాలన్న దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పింఛన్లను మంజూరు చేశారని కొనియాడారు. గ్రామాల్లో ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే వారిని గుర్తించి పింఛన్లు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంపై విమర్శలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేదలకు కనీసం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవానికి ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి, మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 1.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డ్ ఆధునీకరణకు భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని, ప్రధాన రహదారి నుండి మార్కెట్ యార్డ్ వరకు డబుల్ రోడ్డు నిర్మించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.