*నవతెలంగాణ రిపోర్టర్ జగన్ కుటుంబానికి టిడబ్ల్యూజేఎఫ్ అండ*
*కుటుంబానికి రూ.1.12 లక్షల ఆర్థిక సహాయం అందజేత*
*టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్,*
*ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 24 (ప్రజావాణి): మంచాల మండలానికి చెందిన నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ జగన్ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం జర్నలిస్టు లోకానికి తీరని లోటుగా మారింది. మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేరిబాయ్ గణేష్, జిల్లా కార్యదర్శి మైల సైదులు,ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షుడు చిలువేరు యాదగిరి,సహాయ కార్యదర్శి ఎర్ర లింగం, డివిజన్ కమిటీ నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం జగన్ కుటుంబాని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబానికి రూ.1 లక్షా 12 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య మాట్లాడుతూ.. జగన్ కుటుంబం ఒంటరిది కాదని, జర్నలిస్టుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం సంఘం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
జగన్ చిన్ననాటి నుంచే పేదరికంలో పుట్టి అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగారని గుర్తుచేశారు. విద్యార్థి, యువజన సంఘాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.
జర్నలిస్టు వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా ప్రజాసేవకు ఒక వేదికగా భావించి పనిచేశారని నాయకులు గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన వార్తల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. నిరుపేదలు, సామాన్య ప్రజల గొంతుకగా నిలుస్తూ తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు.
జగన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకాలు, ప్రజా సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.
ఒక జర్నలిస్టు కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు తోటి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు అండగా నిలవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. జగన్ కుటుంబానికి అందించిన రూ.1.12 లక్షల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి కొంతైనా ఊరటనిస్తుందని, భవిష్యత్తులోనూ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్ ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తి కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగే రఘు, కార్యదర్శులు రాజశేఖర్, జగదీష్,నిరంజన్, సీనియర్ నాయకులు హాసిమ్, జిల్లా కమిటీ సభ్యులు.. సీనియర్ జర్నలిస్ట్ జోగు శ్రీనివాస్, పీ. వెంకటేష్, మణి, క్రాంతి, అంజి ,సహాయ కార్యదర్శి ఎర్ర లింగం, ఉపాధ్యక్షులు కందుకూరి నగేష్, పి శ్రీనివాస్, శివ, బాలరాజు, గిరికాంత్, శ్రీశైలం, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.