prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 5:19 pm Digital Edition : PRAJA VANI

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

4వ .20వ వార్డుల్లో పర్యటించి సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 24:

పెద్దపల్లి పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని 4, 20వ వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు కొమ్ము సుధాకర్, గణపతి నిర్మలతో కలిసి ఆయన పర్యటించి, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 4వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా 20వ వార్డులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణ ఉపశమనం కల్పించేందుకు తాత్కాలికంగా కచ్చా కాలువ నిర్మించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే శాశ్వత పరిష్కారంగా నూతన సీసీ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (విజ్జన్న) ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో పట్టణంలోని 36 వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చైర్మన్ తెలిపారు. ప్రతి వార్డులో అవసరమైన సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు ప్రజలు, వార్డు అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.