కార్తీక దీపాల వెలుగులతో భక్తజన సంద్రమైన బీరంగూడ గుట్ట
ఉదయం నుంచి స్వామివారి దర్శనాలు, దీపదానాలు, ప్రత్యేక పూజలు
నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
అమీన్‌పూర్, నవంబర్ 24 (ప్రజావాణి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీరంగూడ గుట్టపై కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు దీపదానాలు చేసి, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో రామ బ్రహ్మచారి, కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ ఊరేగింపు, జ్వాల తోరణం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అమీన్‌పూర్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి వేడుకలతో బీరంగూడ గుట్ట దీపాల వెలుగులు, భక్తుల శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.