జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గంగరబోయిన అనిత మల్లేష్, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు గాజుల శేఖర్ లు సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అనిత మల్లేష్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో జీవిత బీమా ఎంతో కీలకమని తెలిపారు. అనుకోని ప్రమాదాలు లేదా కుటుంబ పెద్ద అకాల మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని వివరించారు.
ప్రతి అర్హులైన కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. 24వ వార్డులోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్, నోముల సోమయ్య, వార్డు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బూడిద చిన్నా, అయిల శ్రీను, నోముల ఉప్పలయ్య, కొలిపాక నర్సింహులు, మాచర్ల భిక్షపతి, గుండా శ్రీను, మోటె మల్లేష్, వార్డు ఆఫీసర్ కృష్ణ వాసు, ఆర్‌పీ మంగ, నీల లావణ్య, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.