prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 1:24 pm Digital Edition : PRAJA VANI

సమ్మక్క బ్యారేజ్ లేకుంటే దేవాదుల పరిస్థితి ఏమయ్యేది?

సమ్మక్క బ్యారేజ్ లేకుంటే దేవాదుల పరిస్థితి ఏమయ్యేది?

కేసీఆర్ దూరదృష్టితోనే 365 రోజుల నీటి లభ్యత.. ములుగు రైతులకు సాగునీటి భరోసా ఏదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య

మంగపేట, నవంబర్ 23 (ప్రజావాణి): సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం లేకుంటే దేవాదుల ప్రాజెక్టు పరిస్థితి ఏమయ్యేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే సమ్మక్క బ్యారేజ్ నిర్మించి దేవాదుల ద్వారా 365 రోజులు నీటిని ఎత్తుకునే అవకాశం కల్పించారని ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య అన్నారు. సమ్మక్క బ్యారేజ్ నీటితో ప్రయోజనం పొందుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని గణపాక సుధాకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏమిటని ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం ఉందని ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెప్పడం మాత్రమే ప్రభుత్వ విధానం కాకూడదని, రైతులకు సాగునీటి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కాగ్ నివేదికలు, గణాంకాలు చూపిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారని, అయితే నీళ్లు అందక ఎండిపోతున్న పంటలు, రైతుల కన్నీళ్లకు ఆ లెక్కలు సమాధానం చెప్పలేవని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన గురించి ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా ములుగు రైతులకు సాగునీరు అందించేందుకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ములుగు జిల్లాకు నీళ్లు అందించే ప్రాజెక్టు మాత్రమే కాదని, మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లతో ముడిపడి ఉందని తెలిపారు. తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. ప్రాజెక్టులో లోపాలు ఉంటే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అంతేగానీ రైతులకు నీళ్లందించాలనే లక్ష్యాన్ని కించపరచవద్దని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఆయకట్టు తదితర అంశాలపై కాగ్ నివేదికలోని గణాంకాలను ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ నాయకులు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు మరమ్మతులకు తీసుకున్న చర్యలు, రైతులకు ప్రత్యామ్నాయ సాగునీటి ఏర్పాట్లపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో దేవాదుల ప్రాజెక్టు వర్షాకాలంలో గోదావరిలో నీటి లభ్యతపై ఆధారపడి ఉండేదని, వర్షాలు లేకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క బ్యారేజ్ నిర్మాణంతో దేవాదుల ప్రాజెక్టుకు నీటి లభ్యత కల్పించి ఏడాది పొడవునా నీటిని ఎత్తుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. ఇప్పుడు అదే బ్యారేజ్ నీటితో ప్రయోజనం పొందుతూ గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ములుగు జిల్లాలోని ఏడు మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు ఎన్ని ఎకరాలను లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎన్ని నిధులు కేటాయించారు, భూసేకరణ ఎంతవరకు పూర్తయింది, పెండింగ్ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గోదావరి నది జిల్లాలో ప్రవహిస్తున్నప్పటికీ రైతులు సాగునీటి కోసం వర్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని, సమ్మక్క సారలమ్మ బ్యారేజ్, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం జలవనరులను అనుసంధానం చేస్తూ సమగ్ర సాగునీటి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. దేవాదుల పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధులు కేటాయించింది, ములుగు జిల్లాలో కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించింది, రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు నీటిని అందించే ప్రణాళిక ఏమిటి, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు గడువు ఎంత, పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందిస్తున్నారు, ములుగు రైతులకు శాశ్వత సాగునీటి భరోసా ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉంటే విచారణ జరిపించాలని, అయితే తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని కించపరచడం తగదని అన్నారు. ప్రాజెక్టుల వద్ద ఫొటోలు దిగుతున్నారని బీఆర్ఎస్ నాయకులను విమర్శించే ముందు రైతుల పొలాల్లోకి వెళ్లి ఎండిపోతున్న పంటలను, నీళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతుల పరిస్థితిని చూడాలని గణపాక సుధాకర్‌కు సూచించారు. ప్రజలకు కావాల్సింది ప్రసంగాలు కాదని సాగునీరు, హామీలు కాదని ఆచరణ, విమర్శలు కాదని ఫలితాలని చిట్టిమల్ల సమ్మయ్య స్పష్టం చేశారు.