*మహిళల సంక్షేమ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బీజేపీ నాయకురాలు బచ్చు కృష్ణప్రియ*
*మహిళలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
*సీఎం రేవంత్ రెడ్డిపై బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి విమర్శలు*
*తులం బంగారం, నెలకు రూ.2,500 మహాలక్ష్మి సాయం అమలు చేయాలి.. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది*
మేడ్చల్ (ప్రజావాణి):- తెలంగాణ ఆడబిడ్డలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, పెరుగుతూ తగ్గుతూ ఉంటాయని తెలిసే హామీ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన తులం బంగారం హామీని ఇప్పటికైనా అమలు చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బాకీ పడిందని, అబద్ధపు హామీలు, మాయ మాటలతో అమాయక ప్రజలను మోసం చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఎక్కువ సమయం లేదని, ఈలోపైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వబోరని హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని, మహిళల సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి పేర్కొన్నారు.