ఉద్యమ స్ఫూర్తి కి పట్టం
ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలోజు రామ్మూర్తి
నియామకం
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలోజు రామ్మూర్తి నియమితులయ్యారు.
ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కమిటీని విస్తృతం చేసే సందర్భంగా ఈ నియామకం జరిగింది. ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు రేండ్ల సంతోష్, రామ్మూర్తికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రేండ్ల సంతోష్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. అమరవీరుల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యమంలో తమ విలువైన సమయాన్ని, డబ్బును వెచ్చించి సేవ చేసిన ఉద్యమకారులందరినీ గుర్తించి, వారికి నెలకు రూ. 25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ కోసం పోలోజు రామ్మూర్తి చేసిన సేవలు, ఉద్యమంలో ఆయన చూపిన చురుకైన పాత్ర, తెలంగాణ వచ్చేంత వరకు ఆయన చేసిన నిరంతర పోరాటాన్ని గుర్తించి, ఆయనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోలోజు రామ్మూర్తి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి జినుకల లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు రేండ్ల సంతోష్, ఉపాధ్యక్షుడు సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, ములుగు మండల అధ్యక్షుడు నాగపురి హరినాథంలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ కోసం ఏ స్ఫూర్తితో పోరాడానో, అదే స్ఫూర్తితో ఉద్యమకారులకు గౌరవం దక్కేంత వరకు పోరాడతానని, ఉద్యమకారులందరినీ కలుపుకొని, వారి హక్కులు సాధించేంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి ఎల్లిమిల్ల రఘు, జిల్లా సంయుక్త కార్యదర్శి చిలకమర్రి రాజేందర్, మంగపేట మండల అధ్యక్షుడు చీకుర్తి సుధాకర్, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు తడికల భాస్కర్, తాడ్వాయి మండల అధ్యక్షుడు ఇందారపు లాలయ్య, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు దేవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వెంకటాపురం మండల అధ్యక్షుడు అనంతగిరి రాజు, ఉద్యమ సీనియర్ నాయకుడు గొంగళ్ళ కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.