సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండల పరిధిలోని పెంచికలపేట గ్రామంలో శనివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు
సీపీ శ్వేత ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత,ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ శ్రీను మాట్లాడుతూ.. ప్రజలు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులను నమ్మి వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు వెల్లడించవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు
ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు మాట్లాడుతూ గ్రామాల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు, ఎల్కతుర్తి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఫిర్యాదు చేయాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫోన్ చెయ్యాలని అన్నారు.