prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 10:11 am Digital Edition : PRAJA VANI

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా.. ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా.. ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో సంక్షేమ పథకాల అమలు – 66వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్

హసన్‌పర్తి,(మన ప్రజావాణి),21:

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హసన్‌పర్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో, ఆయన సూచనల మేరకు 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా 66వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబ పెద్దకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా అందించడమే ఇందిరమ్మ బీమా పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, చేయూత పథకం కింద నూతన పింఛన్ల మంజూరు వంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు.

అదేవిధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళా శక్తి భవనాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీల పెంపు వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని గొర్రె కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ, బీసీ, మైనారిటీ నాయకులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.