prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 9:54 pm Digital Edition : UPENDHAR JANAGON

జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటనే ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలి..!  

తెలంగాణ ఉద్యమకారుడు ఈగం శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటనే ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నప్పటికీ ఎంఆర్‌ఐ స్కానింగ్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి నిత్యం వందలాది మంది వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్నారని, వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్ అవసరమని సూచించినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. స్థానికంగా ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని హనుమకొండకు లేదా 100 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. జనగామ జిల్లాతో పాటు చుట్టుపక్కల మూడు నియోజకవర్గాల పేద ప్రజలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన వైద్య కేంద్రంగా ఉందని, ఇక్కడ ఎంఆర్‌ఐ సౌకర్యం లేకపోవడం వల్ల నిరుపేద రోగులు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటనే ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని అమలు చేయగలరు అని ఈగం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.