గుత్తికోయల గూడేనికి పస్రా పోలీసుల భరోసా
మెగా వైద్య శిబిరంపై అవగాహన.. 28న ఉచిత వైద్య సేవలు
గోవిందరావుపేట (ప్రాజెక్ట్ నగర్) ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐపీఎస్ గారి ఆదేశాలు, ములుగు డీఎస్పీ రవీందర్ గారి సూచనల మేరకు, గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్ నగర్ లోని గుత్తికోయల నివాస ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న గుత్తికోయ కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు.
28న మెగా వైద్య శిబిరం
త్వరలో నిర్వహించనున్న మెగా వైద్య ఆరోగ్య శిబిరం గురించి కుటుంబాలకు వివరించి అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి వైద్య బృందాలు రానున్నాయని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తారని తెలిపారు.
శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శాంతిభద్రతలే కాదు.. ప్రజారోగ్యం కూడా మా బాధ్యత
పోలీసులంటే కేవలం శాంతిభద్రతలు, నేరాల అరికట్టడం మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, వారి ఆరోగ్య సంరక్షణకు కూడా అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని పస్రా పోలీసులు చాటుతున్నారు.
మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆరోగ్య సమస్యలను గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ నెల 28న మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గుత్తికోయ కుటుంబాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఈ ప్రయత్నం పోలీసుల మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఖాకీ వెనుక మానవత్వం, సేవాభావం ఉంటాయని నిరూపిస్తున్న పస్రా పోలీసుల కృషిపై స్థానిక ప్రజలు, గిరిజన కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.