గిరిజనుల గుండెల్లో స్థానం సంపాదించిన మన ఎస్ఐ తాజుద్దీన్
సేవలో కఠినత్వం… మనసులో మానవత్వం
గోవిందరావుపేట/ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
పోలీస్ అంటే కేవలం లాఠీ, కేసు, అరెస్ట్ మాత్రమే కాదు. ప్రజల కష్టం తెలిసిన మనిషి, వారి కన్నీటిని తుడిచే చేయి కూడా పోలీసే అని నిరూపిస్తున్నారు పస్రా ఎస్ఐ తాజుద్దీన్.
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐపీఎస్ గారి ఆదేశాలు, ములుగు డీఎస్పీ రవీందర్ గారి సూచనలతో పస్రా పోలీసులు ప్రజల వద్దకే వెళ్తున్నారు. అందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని గుత్తికోయల గూడేలలో ఎస్ఐ తాజుద్దీన్ పర్యటించారు.
రాత్రి వేళ గూడేలలో..
పగలు కాదు, రాత్రి వేళ… చీకటి పడ్డాక కూడా గిరిజన కుటుంబాల మధ్య కూర్చొని వారి సమస్యలు విన్నారు. ఒక్కొక్కరి బాధను నోట్ బుక్ లో రాసుకున్నారు. చిన్నారుల చదువు గురించి అడిగారు. తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరించారు.
“చదువు ఒక హక్కు కాదు… ప్రతి ఒక్కరికీ భవితకు వెలుగు” అని చెబుతూ, గిరిజన పిల్లల భవిష్యత్తు కోసం విద్యనే ఆయుధమని, చదువే మార్పు తెస్తుందని ధైర్యం చెప్పారు.
విద్యా దీపం
ఒక లాంతరు వెలుగులో, చాప మీద కూర్చొని పిల్లలతో మాట్లాడిన ఆ దృశ్యం… అది పోలీస్-ప్రజల మధ్య దూరాన్ని చెరిపేసింది. యూనిఫాంలో ఉన్నా మానవత్వం కోల్పోని అధికారి ఎలా ఉంటారో తాజుద్దీన్ చూపించారు.
“మనసుతో చేసిన చిన్న సహాయం… ఒక జీవితాన్నే మార్చగలదు. సహాయం మాత్రమే కాదు… అవగాహన, ఆదరణ, ఆశయం… అదే వారి భవిష్యత్తుకు వెలుగు” అన్న ఆయన మాటలు గూడేం ప్రజలను కదిలించాయి.
28న మెగా వైద్య శిబిరం
అంతేకాదు, ఈ నెల 28న నిర్వహించనున్న మెగా ఉచిత వైద్య శిబిరం గురించి కూడా ప్రతి కుటుంబానికి వివరించారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వైద్య నిపుణులు వస్తున్నారని, అందరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చుట్టూ ఉన్న వారిని కాపాడటమే కాదు, మనుషుల జీవితాల్లో వెలుగు నింపడం కూడా ఒక పోలీస్ బాధ్యత అని తన సేవతో నిరూపిస్తున్నారు ఎస్ఐ తాజుద్దీన్.
ప్రజల కష్టాలు వినడమే కాదు, వారికి పరిష్కారం చూపేందుకు ముందుండే ఈ ఖాకీ అధికారి గిరిజన ప్రాంతాల్లో నమ్మకానికి ప్రతీకగా మారుతున్నారు.
“సేవే లక్ష్యం… మానవ సేవే మాధవ సేవ.
