prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:08 pm Digital Edition : UPENDHAR JANAGON

సేవకు సరిహద్దులు లేవు.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్…!

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21(ప్రజావాణి):మానవత్వం అంటే ఏమిటో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ మరోసారి చేసి చూపించింది. దూరం ఎంతైనా సరే, ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలనే తపనతో ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సాయం అందించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామానికి చెందిన కిరణ్ జీవితం ఎంతో కష్టాల్లో ఉంది. పుట్టుకతోనే ఒకే కిడ్నీతో పుట్టిన ఆయన ఇప్పుడు షుగర్ వ్యాధితో ఆ కిడ్నీ కూడా పాడవడంతో మంచాన పడ్డారు. కాళ్లు వాచిపోయి నడవలేని పరిస్థితి. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కూలి పని మీదే బతుకుతున్న ఆ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. మందులకు కూడా డబ్బులు లేక కుటుంబం అల్లాడిపోతోంది.

ఈ పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు చలించిపోయారు. దాతలందరూ ముందుకొచ్చి తమ వంతు సహాయం చేశారు. అందరి సహకారంతో రూ.20,025 సమకూరింది.

ఆ డబ్బును స్వయంగా అందించాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పెదపాటి ప్రసన్న కుమార్ సుదూర ప్రయాణం చేసి కిరణ్ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సాయాన్ని వారి చేతికి అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ఎక్కడ ఉన్నా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే మా ఫౌండేషన్ లక్ష్యం. 600 కిలోమీటర్లు ప్రయాణించినా అది పెద్ద విషయం కాదు. దాతలు చూపిన మంచి మనసే నన్ను ఇంత దూరం నడిపించింది” అని అన్నారు.

సాయం పొందిన కిరణ్ దంపతులు కన్నీళ్లతో మాట్లాడుతూ – “మమ్మల్ని ఎవరో గుర్తుంచుకుని ఇంత దూరం వచ్చి సాయం చేస్తారని అనుకోలేదు. మాకు తెలియని దాతలందరికీ పాదాభివందనాలు” అని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో చేతిపాడి షేక్, ప్రసాద్, విశ్వనాథ్, అనసూయమ్మ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.