జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరైనా నిర్వహించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా. వాణి శ్రీ హెచ్చరించారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్కానింగ్ కేంద్రం, విజయ ఆసుపత్రి, లక్ష్మి స్కానింగ్ కేంద్రాలను ఆమె ప్రోగ్రాం అధికారులతో కలిసి సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాల్లో గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం, 1994 (PCPNDT). చట్టం, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గర్భిణీ స్త్రీల స్కానింగ్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఫారం-ఎఫ్ తదితర రికార్డుల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు.
ఆడపిల్ల పుట్టుకను స్వాగతిద్దాం, లింగ వివక్షను రూపుమాపుదాం అని పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డా. హరికృష్ణ, సీహెచ్ఓ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.