బుచ్చంపేటలో రైతులకు ఎఫ్‌పీఓపై అవగాహన
ఎఫ్‌పీఓ సభ్యత్వంతో రైతులకు అదనపు ప్రయోజనాలు – సహకార సంఘం సీఈఓ అల్లి గౌరమ్మ
మంగపేట, నవంబర్ 21 (ప్రజావాణి ):
ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామంలో రైతులకు ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)పై రైతు సేవా సహకార సంఘం సీఈఓ అల్లి గౌరమ్మ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు ఎఫ్‌పీఓ సభ్యత్వాలను నమోదు చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహకార సంఘం బుచ్చంపేట డైరెక్టర్లు చిట్టిమల్ల రజిత, చిట్టిమల్ల సమ్మయ్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతులు రూ.2,000 చెల్లించి ఎఫ్‌పీఓలో సభ్యత్వం పొందితే, నాబార్డు ద్వారా అదనంగా రూ.2,000 లభిస్తుందని, దీంతో రైతు వాటా మూలధనం రూ.4,000 అవుతుందని వివరించారు.రైతులు తాము పండించిన పంటలను రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా కొనుగోలు, అమ్మకాలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పొందవచ్చని పేర్కొన్నారు. రైతులందరూ ఎఫ్‌పీఓ సభ్యత్వం తీసుకొని అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు బూర్గుల వెంకటమల్లు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, తక్కలపల్లి రవీందర్, పల్లె లక్ష్మయ్య, నాగుల సతీష్, గడ్డం పరమేశ, ధర్మారం సాయిలు, పల్లె చిన్న రాములు, మద్దెల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.