prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 11:24 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ గిరిజన రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర వ్యాపారులు

*తెలంగాణ గిరిజన రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర వ్యాపారులు*

తూకాల్లో పత్తి వ్యాపారుల ఘరానా మోసం!

రిమోట్‌తో కాటా అంకెల మాయాజాలం.. పట్టుకున్న అనంతారం రైతులు

ఏజెన్సీ గిరిజన రైతులే టార్గెట్‌గా దళారుల దగా.. నిలదీసిన అన్నదాతలు

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 21

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో రైతుల మోసం చేస్తున్న ఆంధ్ర వ్యాపారులు ఒకవైపు అకాల వర్షాలు, తుఫాన్లు, ఎల్ నినో వంటి ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతూ.. ఆరుగాలం చెమటోడ్చి, అప్పులు చేసి మరీ పంటలు పండిస్తున్న గిరిజన రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. తుఫాన్ వల్ల పత్తి పంటకు తీవ్ర నష్టం రాగా, మిగిలిన కొద్దిపాటి పంటను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోలేని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. ప్రకృతి కన్నెర్ర చేసినా తట్టుకుని నిలబడిన రైతులను, ఇప్పుడు దళారుల రూపంలో మరో ప్రమాదం ముంచెత్తుతోంది.

ఏజెన్సీ ప్రాంతాలనే ఆసరాగా చేసుకుని, అమాయక గిరిజన రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్న కేటుగాళ్ల ముఠా గుట్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామ రైతులు రట్టు చేశారు. డిజిటల్ కాటాలకు రిమోట్‌లు అమర్చి, తూకంలో భారీగా కోత విధిస్తూ మోసానికి పాల్పడుతున్న వ్యాపారులను పట్టుకుని నిలదీశారు.

*అసలేం జరిగిందంటే..*

అశ్వారావుపేట మండలంలోని అనంతారం ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గిరిజన రైతులు ఎక్కువగా వర్షాధార పంటగా పోడు భూముల్లో పత్తిని సాగు చేస్తుంటారు. పండించిన పంటను 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని పట్టణాలకు తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులు భరించలేక, గ్రామాల్లోకి వచ్చే దళారులకే విక్రయిస్తుంటారు. ఇదే అదనుగా భావించిన ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మండలంలోని పలు గ్రామాల్లో పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధరకే కొంటామంటూ నమ్మబలికి, తూకాల్లో దగాకు పాల్పడుతున్నారు.

*జేబులో రిమోట్ దాచుకుని కాంటా అంకెలతో దళారుల గారడీ.. గమనించి నిలదీసిన రైతులు*

అనంతారంలో ఇద్దరు రైతుల వద్ద సుమారు 5 క్వింటాళ్ల పత్తిని ఈ ముఠా కొనుగోలు చేసింది. ఇదే అదునుగా భావించి మళ్లీ వాహనంతో గ్రామానికి వచ్చి, మరో రైతు పత్తిని కొనుగోలు చేసేందుకు కాంటా వేశారు. ఐదుగురిలో ఒకరు కాంటా ఎదురుగా కూర్చుని, జేబులో సెన్సార్ రిమోట్ పెట్టుకుని కాంటాను నడిపించాడు.
సాధారణంగా 50 కిలోల బస్తా తూకం వేసినప్పుడు 30, 35 కిలోలు మాత్రమే చూపేలా రిమోట్‌తో అంకెలు తగ్గిస్తున్నారు. 100 కేజీల బస్తాకు 40 కేజీలు, 50 కేజీల బస్తాకు 15 కేజీల వరకు తేడా రావడంతో రైతులకు అనుమానం కలిగింది. రెండు బస్తాలు వేసినా అనుకున్నంత బరువు రాకపోవడంతో ఎదురుగా కూర్చున్న వ్యక్తిని గమనించగా, అతడు జేబులో ఉన్న రిమోట్‌ను నొక్కడం కనిపించింది. రైతు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే గ్రామస్థులు అతడితో పాటు మిగిలిన వ్యక్తులను చుట్టుముట్టి పట్టుకున్నారు.

*తప్పు ఒప్పుకుని కాళ్లబేరానికి వచ్చిన దళారులు.. తగ్గిన బరువుకు నగదు చెల్లింపు*

మోసాన్ని గుర్తించిన రైతులు ఆగ్రహంతో వ్యాపారులను నిలదీయడంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తప్పు ఒప్పుకున్న వ్యాపారులు రైతుల కాళ్లపై పడి క్షమాపణ కోరారు. రెండు రోజుల క్రితం నుంచి కొనుగోలు చేసిన పత్తికి, తాజాగా కాంటా వేసిన పత్తికి కలిపి తగ్గిన బరువుకు సరిపడా నగదు చెల్లించేందుకు అంగీకరించారు. మరోసారి ఈ ప్రాంతంలో కనిపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించడంతో వ్యాపారులు తమ వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గ్రామాల్లో వ్యాపారుల కొనుగోళ్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, అవగాహన లోపం వల్ల గిరిజన రైతులు మోసాల బారిన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు స్పందించి, ఏజెన్సీ గ్రామాల్లో తూకాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాల్లోని అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దళారుల ఆగడాలను అడ్డుకుంటే గిరిజన రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులకు తూకాలు, కొనుగోళ్లపై అవగాహన కల్పిస్తూ అధికారులు అండగా నిలవాలని కోరుతున్నారు.