*చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మండల ప్రథమ బహుమతి సాధించిన గీతాంజలి స్కూల్ విద్యార్థులు*
ముదిగొండ నవంబర్ 21 ప్రజావాణి
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ముదిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో గోకినేపల్లి గీతాంజలి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, ప్రతిభ, ఆలోచనా సామర్థ్యంతో పోటీలో ముందంజ వేసి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మండల ఇన్చార్జి శ్రీ బి. వెంకన్న, పాఠశాల కరస్పాండెంట్ వై. నాసరయ్య విద్యార్థులను అభినందిస్తూ, వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులను ప్రశంసించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా ధోరణి, విజ్ఞానంపై ఆసక్తి, పోటీతత్వం పెంపొందించేందుకు ఇటువంటి టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వై. నాసరయ్య మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థులు గత విద్యా సంవత్సరం కూడా మండల స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారని, ఈ సంవత్సరం సైతం అదే విజయాన్ని పునరావృతం చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. మండల స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు వరుసగా ప్రతిభ కనబరుస్తూ ప్రథమ బహుమతులు సాధించడం పాఠశాల విద్యా ప్రమాణాలకు, ఉపాధ్యాయుల కృషికి, విద్యార్థుల పట్టుదలకు నిదర్శనమని తెలిపారు.