*గ్రామీణ మహిళా సాధికారతలో లక్పతి దీదీ పథకం కీలకం*
రాయికల్ ;నవంబర్ 21(ప్రజావాణి)
గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి సాధికారత వైపు నడిపించడంలో లక్పతి దీదీ పథకం కీలక పాత్ర పోషించనుందని జగిత్యాల జిల్లా శిక్షకులు మహమ్మద్ హుస్సేన్, పి. అశోక్ లు పేర్కొన్నారు. రాయికల్ మండల కేంద్రంలోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కొత్తగా వచ్చిన సంఖ్యా ఆజీవిక నమోదు పుస్తకంపై నవంబర్ 20, 21 తేదీల్లో వివోఏ లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోని మహిళా సమాఖ్య స్వయం సహాయక సంఘ సభ్యులను సంవత్సర కాలంలో కనీసం లక్ష రూపాయలకు మించి ఆదాయం పొందే లబ్ధిదారులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామీణ మహిళలు కేవలం సంఘ సభ్యులుగానే కాకుండా సొంత ఆదాయంతో నిలబడే సాధికార మహిళలుగా ఎదగాలన్నదే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమన్నారు.దీని కోసం మహిళలకు వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎనిమిది సమూహాల్లో వారి మొత్తం ఆదాయ వివరాలను సేకరించి, ప్రతి సమూహానికి ఎంత ఆదాయం వచ్చిందో అంతర్జాల సంఖ్యా ఆజీవిక నమోదు పుస్తకంలో నమోదు చేయనున్నారు.ఇలా నిరంతర పర్యవేక్షణ చేయడం వల్ల ఏ మహిళ ఎంత సంపాదిస్తోంది, ఎవరికి ఇంకా సహాయం అవసరం అనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబాన్ని, గ్రామాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారడానికి ఈ పథకం బలమైన పునాది వేయనుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధికై నిరంతరం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం పోతు నరహరి, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, 40 వివోఏలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.