*రావల్‌కోల్‌లో ఏసీబీ వలలో వార్డు ఆఫీసర్*
*రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు*
*ఇంటి మ్యూటేషన్ కోసం రూ.40 వేలు డిమాండ్*
*బేరసారాల అనంతరం రూ.30 వేలకు ఒప్పందం*
*మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారుల పాత్రపైనా ఏసీబీ విచారణ*
మేడ్చల్, నవంబర్(ప్రజా వాణి): ఇంటి మ్యూటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన వార్డు ఆఫీసర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన రావల్‌కోల్‌లో కలకలం రేపింది. బాధితుడి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా వార్డు ఆఫీసర్ డి. రవీందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.
అధికారి డిమాండ్ చేసిన లంచం చెల్లించేందుకు బాధితుడు నిరాకరించడంతో ఇరువురి మధ్య బేరసారాలు జరిగాయి. చివరకు రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినప్పటికీ, లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రూ.30 వేల లంచం తీసుకుంటున్న వార్డు ఆఫీసర్ డి. రవీందర్ రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం సంబంధిత అధికారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ లంచం వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ పాత్ర ఏమైనా ఉందా? ఇతర అధికారులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులే లంచాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.