prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 7:32 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లిలో ప్రారంభమైన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు ప్రక్రియ

క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీ చేసిన జిల్లా జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డీఎఫ్ఓ రవి ప్రసాద్

తొలిరోజు నాలుగు గ్రామ పంచాయతీలలో 353 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి నవంబర్ 20 (ప్రజావాణి):

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అర్హుల నమోదు మరియు ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియ శుక్రవారం ఎండపల్లి మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలలో ఘనంగా ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ ప్రక్రియను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పి సీఈవో) బి గౌతమ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఓ) ఎం రవి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మండలంలోని కొండపూర్, రాజరాంపల్లి, సూరారం, శానబండ గ్రామ పంచాయతీలలో జరుగుతున్న డేటా ఎంట్రీ విధానాన్ని అధికారులు స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా పథకానికి దూరం కాకుండా, పూర్తి పారదర్శకతతో, వేగవంతంగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ వివరాలను ఎండపల్లి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి డి కృపాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు, అర్హులైన లబ్ధిదారులు తమ వివరాల నమోదు, ధృవీకరణ కోసం గ్రామ పంచాయతీలలో కేటాయించిన సిబ్బందిని సంప్రదించి, ప్రభుత్వం అందిస్తున్న ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

తొలిరోజు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి:

నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,671 రేషన్ కార్డులు ఉండగా, శుక్రవారం ఒక్కరోజే 353 కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

కొండపూర్: మొత్తం 797 కార్డులకు గాను 115 నమోదయ్యాయి.

రాజరాంపల్లి: మొత్తం 604 కార్డులకు గాను 120 నమోదయ్యాయి.

సూరారం: మొత్తం 168 కార్డులకు గాను 72 నమోదయ్యాయి.

శానబండ: మొత్తం 102 కార్డులకు గాను 46 నమోదయ్యాయి.