prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 8:43 pm Digital Edition : MAHESH MEDCHAL

ఈసీఐఎల్ యూనియన్ ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఘనవిజయం

*ఈసీఐఎల్ యూనియన్ ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఘనవిజయం

13 ఓట్ల మెజారిటీతో విజయభేరి.. భారతీయ మజ్దూర్ సంఘ్ (ECMS)కు కార్మికుల షాక్

2027 వేతన సవరణే లక్ష్యంగా కొత్త నాయకత్వానికి కార్మికుల పట్టం

కుషాయిగూడ, నవంబర్ 21:- ఈసీఐఎల్ కార్మిక సంఘం ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. కార్మికుల మద్దతుతో ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఘనవిజయం సాధించింది. భారతీయ మజ్దూర్ సంఘ్ (ECMS)పై 13 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. కార్మికుల ఓటు రూపంలో వెలువడిన ఈ తీర్పు యూనియన్ నాయకత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది.కొత్త లేబర్ కోడ్స్‌లోని ఇండస్ట్రియల్ రిలేషన్స్ (IR) కోడ్ మార్గదర్శకాల ప్రకారం మూడేళ్ల కాలపరిమితికి నిర్వహించిన ఈ వెరిఫికేషన్ ఎన్నికలు ఈసీఐఎల్‌లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత మూడేళ్లలో ఇన్సెంటివ్ అగ్రిమెంట్‌లో ప్రాఫిట్ షేర్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు అందకపోవడం, కార్మికులు లక్షల రూపాయల మేర ఆర్థికంగా నష్టపోవడం, ప్రమోషన్ పాలసీలో సమస్యలు, క్యాష్‌లెస్ వైద్య విధానంలో ఎదురైన ఇబ్బందులు ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి.ముఖ్యంగా 2027లో జరగనున్న వేతన సవరణను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులైన నాయకత్వం అవసరమని భావించిన కార్మికులు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు మద్దతు పలికినట్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఇన్సెంటివ్ ఒప్పందంలో ప్రాఫిట్ షేర్ విషయంలో కార్మికులకు ఆశించిన ప్రయోజనాలు దక్కలేదని, ఫలితంగా తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 2027 వేతన సవరణలో మెరుగైన ఒప్పందం సాధించడంతో పాటు కార్మికుల హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.అనంతరం ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్.టి మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, వైద్య సదుపాయాలు, కార్మిక సంక్షేమం, మెరుగైన వేతన ఒప్పందం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.
ఎన్నికల్లో తమపై నమ్మకం ఉంచి విజయాన్ని అందించిన కార్మికులు, ఉద్యోగులు, యూనియన్ శ్రేణులు, అలయన్స్ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు యూనియన్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సి.హెచ్.భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్.టి, అలయన్స్ నాయకులు బి. ప్రవీణ్,కే.శ్రీనివాస్, టి. పద్మారెడ్డి, పి. వెంకటేష్, విజయ, ఏ. వీరు నాయక్, రమేష్ ఆర్., రాజశేఖర్, నరేందర్ రెడ్డి, వెంకటేష్, శ్రీకాంత్, జి. మనోహర్, కోరుకొండ రాజు, ప్రశాంత్, శ్రీను బి. తదితరులు పాల్గొన్నారు.