prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 11:05 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలక్షనా’లేక సెలక్షనా’? పోలీసుల సామ్రాజ్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం

బద్వేల్,నవంబర్ 20:ప్రజావాణి ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నాయా.లేక అధికార పక్షం కనుసన్నల్లో ‘సెలక్షన్ల’ పర్వంగా మారుతున్నాయా?అనే అనుమానం కలుగుతోందని మాజీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తీరుపై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.స్థానిక పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జిల్లా ఎస్పీ (రాష్ట్ర పోలీస్ యంత్రాంగం) ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను, ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని కిందిస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఎస్పీ ఆదేశాలు బాగున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు.నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పోరుమామిళ్ల ఎస్ఐ (సబ్ ఇన్‌స్పెక్టర్) ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు,అభ్యర్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యమా? పోలీస్ సామ్రాజ్యమా?

“ఇది ప్రజాస్వామ్య దేశమా లేక పోలీసుల సామ్రాజ్యమా?” అని నాగార్జున రెడ్డి ప్రశ్నించారు.పోరుమామిళ్ల ఎస్ఐ పచ్చ ముసుగు వేసుకున్న కాకిలా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి,బెదిరింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు.”మర్యాదగా మీ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా (మిత్ర చేసుకుంటారా)? లేక రాజీ పడతారా? లేదంటే మీపై అక్రమ కేసులు పెట్టాలా?” అంటూ పోలీస్ స్టేషన్లలోనే ఉంచి అభ్యర్థులను భయపెడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని ఆయన ఆరోపించారు.బ్రిటిష్ పాలన కంటే ఘోరం ప్రస్తుత పరిణామాలు గతంలో బ్రిటీష్ వారు చేసిన అరాచకాల కంటే ఘోరంగా ఉన్నాయని,కేవలం ఒక వర్గాన్ని,ఒక పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ ఈ బెదిరింపుల పర్వం సాగుతోందని నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేల్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో గత 40 సంవత్సరాలుగా ఎన్నడూ ఇలాంటి అప్రజాస్వామిక, భయానక వాతావరణం రాలేదని.కానీ ఇప్పుడు మాత్రం ఆ దారుణమైన పరిస్థితి కళ్లముందు కనబడుతోందని స్పష్టం చేశారు.గతంలో జరిగిన జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సామాన్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని,ఇప్పుడు కూడా అదే పరిస్థితిని పునరావృతం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.తిరగబడక తప్పదు.ఆమరణ దీక్షకు సిద్ధం:ఇలాంటి అరాచక పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు, నాయకులు మూగప్రేక్షకుల్లా చూస్తూ కూర్చోరని,ప్రజలే స్వయంగా తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా,సక్రమంగా నిర్వహించకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడబోనని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.ఈ అక్రమాలు,పోలీసుల బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే గౌరవ జిల్లా ఎస్పీ కి సమాచారం అందించడం జరిగిందని ఆయన తెలిపారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని,క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రతా వాతావరణాన్ని కల్పించాలని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.