prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:04 pm Digital Edition : PRAJA VANI

యువ నాయకత్వం.. అభివృద్ధికి కొత్త బాట

*యువ నాయకత్వం.. అభివృద్ధికి కొత్త బాట!*

*ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు!*

*రేషన్ సరుకుల నుంచి ఆర్టీసీ బస్సు వరకు.. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు*

*ఎమ్మెల్యే సహకారంతో కోట్లాది రూపాయల నిధులు.. ప్రజా సేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ సర్పంచ్ దుర్గావార్ గణేష్*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, తనూర్ నవంబర్ 20:-
రాజకీయాల్లో యువత ప్రవేశిస్తే అభివృద్ధికి కొత్త ఆలోచనలు, ప్రజాసేవకు కొత్త మార్గాలు ఏర్పడతాయని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లా తనూర్ మండలం భామిని గ్రామ సర్పంచ్ దుర్గావార్ గణేష్. 2025 సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యంత తక్కువ వయసులో సర్పంచ్‌గా విజయం సాధించిన ఆయన, ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తూ తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

*40 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. గ్రామంలోనే రేషన్ పంపిణీ!*

భామిని గ్రామంలో సుమారు 300 కుటుంబాలు గత 40 ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాయి. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మహాలింగి గ్రామంలోని రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరుపేదలు అనేక అవస్థలు పడేవారు. ఈ సమస్యను ఎన్నికల సమయంలో గుర్తించిన గణేష్, గ్రామంలోనే రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆ హామీని నిలబెట్టుకొని గ్రామంలోనే రేషన్ డీలర్ ద్వారా సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేయించారు. దీంతో సుమారు 300 కుటుంబాలకు దశాబ్దాల సమస్య నుంచి ఉపశమనం లభించింది.

*గ్రామానికి ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు ఊరట!*

గ్రామ ప్రజల రవాణా సమస్యలను గుర్తించిన సర్పంచ్ గణేష్, స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో భామిని గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. గతంలో మూడు కిలోమీటర్ల దూరంలోని మహాలింగి గ్రామానికి వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉండగా, ప్రస్తుతం భామిని గ్రామ ప్రజలకు అందుబాటులోకి బస్సు సౌకర్యం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.

*విద్యుత్ సమస్యకు చెక్.. రూ.2.87 కోట్లతో 33 కేవీ సబ్‌స్టేషన్!*

గ్రామంలోని రైతులు వ్యవసాయ బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తుండటంతో విద్యుత్ వినియోగం అధికమై సరైన విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో భామిని గ్రామానికి రూ.2 కోట్ల 87 లక్షల వ్యయంతో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించడంలో కృషి చేశారు. అదేవిధంగా గ్రామంలో ఒక విద్యుత్ డీటీఆర్ ఏర్పాటు చేయించడంతో పాటు మరో 37 కొత్త విద్యుత్ స్తంభాలు మంజూరు చేయించారు.

*మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట..*

గ్రామాభివృద్ధిలో భాగంగా మహిళా సంఘాలకు ఉపయోగపడేలా రూ.10 లక్షలతో వీవో బిల్డింగ్, మరో రూ.10 లక్షలతో వీవో షెడ్ మంజూరు చేయించారు. రైతుల అవసరాల కోసం రూ.30 లక్షలతో గోదాం నిర్మాణానికి నిధులు సాధించారు. గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

*పేదల సొంతింటి కలకు చేయూత.. 42 ఇందిరమ్మ ఇళ్లు!*

గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో 30 ఇళ్లు, రెండో విడతలో మరో 12 ఇళ్లు మంజూరు చేయించడంలో కృషి చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్లకు సంబంధించి 14 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందేలా చర్యలు తీసుకున్నారు. అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యేలా కృషి చేశారు.

*సొంత ఖర్చుతో బోరుబావి.. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు!*

గ్రామ ప్రజల తాగునీటి సమస్యను గుర్తించిన సర్పంచ్ గణేష్ తన సొంత ఖర్చులతో బోరుబావి తవ్వించి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. మరోవైపు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి విద్యార్థుల సంఖ్యను 36కు పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. గ్రామంలో విద్య, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు.

*కుటుంబ పాలనకు స్వస్తి.. ప్రజల పాలనకు ప్రాధాన్యత!*

గ్రామంలో గతంలో కొనసాగిన కుటుంబ ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలుకుతూ, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించడమే తన లక్ష్యమని సర్పంచ్ దుర్గావార్ గణేష్ చెబుతున్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగితే గ్రామాల రూపురేఖలు మార్చవచ్చని తన పనితీరుతో చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో మరిన్ని ప్రభుత్వ నిధులు తీసుకువచ్చి భామిని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవను లక్ష్యంగా చేసుకోవాలి అనే సందేశంతో భామిని గ్రామంలో యువ సర్పంచ్ దుర్గావార్ గణేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల మధ్య ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయడమే తన ప్రాధాన్యతగా ఆయన ముందుకు సాగుతున్నారు.