బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
దండేపల్లి, నవంబర్ 20 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సెక్టార్ పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దండేపల్లి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, చిన్న వయసులో వివాహాలు జరిపించడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాలికల విద్యను ప్రోత్సహించాలని, బాల్య వివాహాల నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎంఆర్ఓ, గ్రామ సర్పంచ్ కొత్తపల్లి కల, ఉప సర్పంచ్ తోట శ్రీధర్, వార్డు సభ్యులు, మాజీ డీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు లిప్సిక, పంచాయతీ కార్యదర్శి లావణ్య, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు ఎన్. పద్మతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.