prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 10:57 pm Digital Edition : UPENDHAR JANAGON

పాక్స్ నామినేటెడ్ నియామకాలపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్ )లో నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ల నియామకాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం నామినేటెడ్ నియామకాలు చేపట్టడం సరైన విధానం కాదని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు.

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నామని, పాక్స్ ఎన్నికల తేదీలను రెండు వారాల్లోగా ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించడం హర్షణీయమని అన్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే ప్రస్తుతం ఉన్న చైర్మన్లే యథావిధిగా కొనసాగుతారని స్పష్టం చేయడం ప్రజాస్వామ్య విలువలకు బలం చేకూర్చిందని తెలిపారు.

రైతులకు సంబంధించిన సహకార సంఘాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా పాక్స్
వ్యవస్థ పనిచేయాలని, ప్రభుత్వం ఇకనైనా రాజకీయ జోక్యాన్ని పక్కనపెట్టి, హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు తీర్పును గౌరవించి, ప్రజాస్వామ్యబద్ధంగా పాక్స్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.