నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
20కి పైగా ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా
2 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు.. యువత సద్వినియోగం చేసుకోవాలి
మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 20:
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ట్రినిటీ విద్యాసంస్థలు చేపడుతున్న మెగా జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ నెల 21న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం కళాశాల సిబ్బందితో కలిసి ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మమతా రెడ్డి మాట్లాడుతూ.. ట్రినిటీ విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాయని తెలిపారు. విద్యను అందించడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా 20కి పైగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలను స్థానిక యువత వద్దకే తీసుకువచ్చి 2 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. గతంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు 3 వేల మంది యువతకు వివిధ రకాల శిక్షణ, కోచింగ్ ఇప్పించి ఆర్మీతో పాటు ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. అదే సేవా స్ఫూర్తితో ప్రస్తుతం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు.
ఉద్యోగం అనేది కేవలం ఒక వ్యక్తికి ఉపాధి కల్పించడం మాత్రమే కాదని, ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమని ఆమె అన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ప్రముఖ కంపెనీలను స్థానిక ప్రాంతానికే తీసుకురావడం యువతకు గొప్ప అవకాశమని తెలిపారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి పెద్దపల్లి ప్రగతినగర్‌లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లతో పాటు అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలతో పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్, అడ్మిన్ హెడ్ ఆఫీసర్ సురేష్, రాజిరెడ్డి, చొప్పరి వంశీ, ప్రభాకర్, డాక్టర్ ఆరిఫ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ భవిత, స్వాతి, అశోక్, లక్ష్మి, వంశీ తదితరులు పాల్గొన్నారు.