తుది పోటీదారుల జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పులకు తావివ్వకూడదు
అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 19 మచిలీపట్నం, కృష్ణాజిల్లా
రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, తుది పోటీదారుల జాబితాను అత్యంత జాగ్రత్తగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, డీఎల్‌డీఓలు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థుల ఉపసంహరణకు ముందే పోటీదారుల పేర్లు, సీరియల్ నంబర్లను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఖరారు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల క్రమంలో అమర్చేందుకు తెలుగు పండితుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఒకే పేర్లు ఉన్న అభ్యర్థుల విషయంలో నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మండల ప్రత్యేక అధికారులు, మాస్టర్ ట్రైనర్లు స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులకు అవసరమైన హ్యాండ్ హోల్డింగ్ అందించాలని, పేర్లు, అక్షర దోషాలు, సీరియల్ నంబర్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సమయం వృథా కాకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.