prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:50 pm Digital Edition : UPENDHAR JANAGON

చిన్ననాటి స్నేహితురాలికి అండగా నిలిచిన కడవెండి 2008-09 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): కష్టకాలంలోనే నిజమైన స్నేహం ఏమిటో తెలుస్తుందన్న సత్యాన్ని మరోసారి నిరూపించారు జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన జెడ్పిహెచ్ఎస్ లో 2008-09 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌లో చదివిన మిత్రులు. అనారోగ్యంతో భర్తను కోల్పోయి, తీవ్ర దుఃఉన్న చిన్ననాటి స్నేహితురాలు పడమటింటి (గండి) అనూషకు మానవతా దృక్పథంతో అండగా నిలిచి, తమ స్నేహబంధం ఎంత గొప్పదో చాటుకున్నారు.

అనూష భర్త గండి యాదగిరి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడని తెలుసుకున్న వెంటనే చిన్ననాటి స్నేహితులంతా చలించిపోయారు. కడవెండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కలిసి చదివిన రోజులు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, ఆమెకు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి తమ వంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని సేకరించి, అనూషకు అందజేశారు.

కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, ఆమెకు మనోధైర్యాన్ని అందించారు. “ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నాము, నువ్వు ఒంటరివి కాదు” అంటూ భరోసా ఇచ్చారు. కష్ట సమయంలో స్నేహితులు అండగా నిలవడం వల్ల కలిగే ధైర్యం మాటల్లో చెప్పలేనిదని, ఆపద సమయంలో తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

చిన్ననాటి స్నేహితుల ఈ మానవతా స్పందన పట్ల స్థానికులు, పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పదుల సంవత్సరాలు గడిచినా చెక్కుచెదరని స్నేహబంధం, కష్టంలో ఉన్న స్నేహితురాలికి అండగా నిలిచిన తీరు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు.

ఈ కార్యక్రమంలో పడకండి శ్రీకాంత్, దండంపెల్లి నవీన్, పడమటింటి అనిల్, జేరిపోతుల భాస్కర్, కాశబోయిన ప్రశాంత్, జిట్టే స్వామి, మహేష్, చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.