అమీన్పూర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలక ఆయుధాలు
రూ.80 లక్షల వ్యయంతో పోలీస్ స్టేషన్ పరిధిలో 153 కెమెరాల ఏర్పాటు
దాతలకు శాలువాలతో సత్కారం
అమీన్‌పూర్, నవంబర్ 19 (ప్రజావాణి): నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీజీఐఐసీ, పలువురు దాతల సహకారంతో సుమారు రూ.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 153 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాల ఫుటేజీ కీలక ఆధారంగా నిలుస్తుందని తెలిపారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కదలికలను గుర్తించి, వారి ఆచూకీ కనుగొనేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాల నిఘా వల్ల నేరాలకు పాల్పడే వారిలో భయం ఏర్పడి, నేరాల నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, పోలీసులకు ప్రజల సహకారం తోడైతే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన దాతలను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ శాలువాలతో సత్కరించి అభినందించారు. ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అమీన్‌పూర్ పరిధిలో 153 సీసీ కెమెరాల ఏర్పాటు పోలీసుల నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించనుంది.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్. శ్రీనివాస్, ఆర్‌సీ పురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, అమీన్‌పూర్ సీఐ ప్రవీణ్ రెడ్డి, ఆర్‌సీ పురం సీఐ లాలూ నాయక్, పరిశోధన విభాగం ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
