పీఠం ఎవరిదైనా.గెలుపు ప్రజలది కావాలి
పోరుమామిళ్ల నవంబర్ 19 ప్రజావాణి వైఎస్ఆర్ జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పోరుమామిళ్ల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది.సుదీర్ఘ నిరీక్షణకు,స్థానిక నేతల ఉత్కంఠకు తెరదించుతూ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోరుమామిళ్ల నూతన ఎంపీపీ ఎవరనేది అధికారికంగా తేలనుంది.ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన ఈ ప్రతిష్టాత్మక పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
కూటమి ఆధిక్యం.ఉత్కంఠ రేపుతున్న ఎంపిక
మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్న పోరుమామిళ్ల మండలంలో, మెజారిటీకి 9 స్థానాలు అవసరం.ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఏకగ్రీవాలు,ఫలితాల సరళిని పరిశీలిస్తే.టీడీపీ 8,జనసేన 2,బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించి కూటమి స్పష్టమైన ఆధిక్యంతో (11 స్థానాలు) సురక్షిత తీరానికి చేరింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకే పరిమితం కాగా,ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ,సొంత పార్టీలోనే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోరుమామిళ్ల పీఠం ఎవరికి*అనే ఉత్కంఠ ఊరిస్తోంది.అభ్యర్థి ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వం,నియోజకవర్గ ఇన్చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి మరియు ముఖ్య నేతలు ఆయా ఎంపీటీసీల అభిప్రాయాలను సేకరించి ఒక సమతూకమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వర్గపోరును అధిగమించి ఏకాభిప్రాయం సాధించేనా
నామినేషన్ల పర్వం నుంచే పోరుమామిళ్లలో స్థానిక టీడీపీ నేతల మధ్య టికెట్ల రగడ,తీవ్ర విభేదాలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.అంతర్గత ఘర్షణలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. అయితే, అధికారం చేతికి వచ్చే కీలక తరుణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో అగ్రనాయకత్వం సఫలీకృతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రజల చూపు.. నేతల ఆశలు
మండలంలో అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా, ప్రజా సమస్యలు త్వరితగతిన తీరాలన్నా సమర్థుడైన నాయకుడు ఎంపీపీ కుర్చీలో కూర్చోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.గెలిచిన ఎస్సీ సామాజికవర్గ ఎంపీటీసీల్లో ఎవరి పేరును అధిష్ఠానం ఖరారు చేస్తుంది? ఎవరికి ‘బి-ఫామ్’ అందుతుంది? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రక్రియ ముగిసిన వెంటనే పోరుమామిళ్ల నూతన ‘మండల రథసారథి’ పేరు అధికారికంగా వెల్లడి కానుంది.