prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 12:08 pm Digital Edition : RAJASHEKARREDDY

సీఎం పర్యటన వేళ బెజ్జంకిలో ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులు

బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెజ్జంకి, నవంబర్ 19 (ప్రజావాణి)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో బెజ్జంకి మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బెజ్జంకి మండలంలో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరైన చర్య కాదని, ఇది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.ముందస్తుగా అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగెం మధు, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, నాలువాల స్వామి, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఏల శేఖర్ బాబు తదితరులు ఉన్నారు.