తుంటి ఎముక విరుపులకు యశోదలో అత్యాధునిక చికిత్స
పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే మెరుగైన వైద్యం
ఆపరేషన్ మరుసటి రోజు నుంచే నడిచే అవకాశం
సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ కిడియూర్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 19
తుంటి ఎముక విరుపులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక వైద్య సాంకేతికతతో మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ కిడియూర్ తెలిపారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆధునిక పద్ధతుల ద్వారా చికిత్స అందించి, రోగులు త్వరగా కోలుకునేలా చేస్తున్నట్లు వెల్లడించారు.
గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుంటి ఎముక విరుపుల చికిత్సలో యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న నూతన వైద్య విధానాలను వివరించారు. సాధారణంగా తుంటి ఎముక విరిగినప్పుడు కీలు పూర్తిగా మార్చడం లేదా విరిగిన ఎముకను తిరిగి అతికించడం వంటి చికిత్సా విధానాలను అనుసరిస్తారని తెలిపారు. అయితే కీలు మార్పిడి శస్త్రచికిత్స పెద్దదిగా ఉండటంతో రక్తస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, శస్త్రచికిత్స అనంతరం ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వివరించారు.
ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా ఎముకలు బలహీనంగా ఉన్నవారికి పీఎఫ్ఎన్ఏ విత్ సిమెంట్ ఆగ్మెంటేషన్ అనే అత్యాధునిక చికిత్సా విధానాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలో చిన్న రంధ్రం ద్వారా ప్రత్యేక టైటానియం రాడ్‌ను ఎముకలో అమర్చి, బలహీనంగా ఉన్న ప్రాంతంలో బోన్ సిమెంట్‌ను నింపడం ద్వారా ఎముకకు మరింత గట్టి పట్టు కల్పిస్తామని తెలిపారు.
ఈ చికిత్సలో పెద్ద కోత అవసరం లేకుండా తక్కువ సమయంలో శస్త్రచికిత్స పూర్తిచేయవచ్చని, తద్వారా రోగులకు శస్త్రచికిత్స అనంతర ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. ముఖ్యంగా ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే వైద్యుల పర్యవేక్షణలో మంచంపై కూర్చోవడంతో పాటు నడిచేందుకు, రోజువారీ పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
వయస్సు పైబడినవారిలో తుంటి ఎముక విరుపులు తీవ్రమైన సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సాంకేతికతతో త్వరితగతిన చికిత్స అందించడం ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ బ్రిజేష్ కిడియూర్ పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణరావు పాల్గొన్నారు.