prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 5:35 pm Digital Edition : PRAJA VANI

గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తుల పోటెత్తు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా 328 జంటలతో స్వామివారి వ్రతాలు

గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తుల పోటెత్తు
కార్తీక శుద్ధ దశమి సందర్భంగా 328 జంటలతో స్వామివారి వ్రతాలు
కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను పరిశీలించిన సీఐ రమణమూర్తి, ఎస్ఐ రాజవర్ధన్
దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం కార్తీక శుద్ధ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా 328 మంది దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి దీపదానాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వాహనాల రాకపోకలను నియంత్రించారు. భక్తుల కోసం లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ నెల 24న నిర్వహించనున్న కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ రాజవర్ధన్ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్ స్థలాలు, దర్శన టికెట్ల కౌంటర్లు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించి ఆలయ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన భద్రతా చర్యలు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు.