సీఎం సభను విజయవంతం చేయాలని నీలం మధు ముదిరాజ్ పిలుపు
సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
పటాన్చెరు, నవంబర్ 18 (ప్రజావాణి): సిద్దిపేటలో గురువారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో సీఎం సభ నిర్వహించనున్న ప్రాంగణాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఇన్‌చార్జి పూజల హరికృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు.
సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సమన్వయంతో పనిచేస్తూ సభకు వచ్చే ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.