prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:27 pm Digital Edition : PRAJA VANI

రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ముతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ముతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్ల వినతి

హుజూర్‌నగర్, నవంబర్ 18 (మన ప్రజావాణి):

హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15, 16వ వార్డుల లింగగిరి రోడ్డులో ఉన్న రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా వార్డుల కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న నల్లటి పొట్టు దుమ్ము ఇళ్లపై, బయట ఉంచిన వస్తువులపై, ఆరబెట్టిన దుస్తులపై విపరీతంగా పేరుకుపోతోందని కౌన్సిలర్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. గాలిలో కలుస్తున్న దుమ్ము ప్రజల కళ్లలో పడటంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైస్ మిల్లు యాజమాన్యం వెంటనే దుమ్ము, ధూళి బయటకు రాకుండా తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు, 15వ వార్డు కౌన్సిలర్ నల్లగొండ సుజాత చంటి, 16వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోతుల బద్రమ్మ, వార్డు సభ్యుడు అలవాల నరేష్ పాల్గొన్నారు.