prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 11:51 am Digital Edition : PRAJA VANI

రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం

రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం

దళారుల దోపిడీపై ఎమ్మెల్యే విజయరమణారావు మౌనం వీడాలి

70 శాతం సన్నధాన్యం ప్రైవేటు వ్యాపారులకే విక్రయం.. రైతులకు ఇచ్చిన బోనస్ హామీ ఏమైంది?

బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 18

సుల్తానాబాద్: రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో, సన్నధాన్యానికి బోనస్ చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వంపై, సంబంధిత ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 70 శాతం సన్నధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండటంతో రైతులు తక్కువ ధరకు అయినా ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

గతంలో సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించిందని, అయితే గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ ఇప్పటికీ రైతులకు అందలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బోనస్‌ను సకాలంలో ఎందుకు చెల్లించడం లేదని ఎమ్మెల్యే విజయరమణారావును ప్రశ్నించారు.

జిల్లాలో సుమారు 200 రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు కేవలం 10 నుంచి 15 మిల్లులకు మాత్రమే అలాట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. జిల్లాలో 300కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, కేవలం 12 కేంద్రాల్లోనే కొనుగోళ్లు ప్రారంభం కావడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపకపోవడం, మిల్లులను కేటాయించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మరోవైపు ధాన్యం కొనుగోలులో దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, ఒక్కో ధాన్యం బస్తాకు రెండు నుంచి మూడు కిలోల వరకు అదనంగా తీసుకుంటూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం సమీక్షలు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.

కొద్దిరోజుల క్రితం వరకు సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.3,500కు పైగా చెల్లించేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారని, ప్రస్తుతం కోతలు పూర్తయ్యే సమయానికి ధరను రూ.2,600కు తగ్గించారని తెలిపారు. రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రాబోయే వేసవి కాలంలో సాగునీరు అందించలేమని, విద్యుత్ సరఫరా చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కనీసం ప్రస్తుత పంటనైనా రైతులకు లాభసాటిగా ఉండేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే విజయరమణరావు దళారులు, మిల్లర్లకు వత్తాసు పలకకుండా మౌనం వీడి రైతుల పక్షాన నిలబడాలని హితవు పలికారు.

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను వెంటనే చెల్లించాలని, దళారుల దోపిడీని అరికట్టాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కట్కూరి సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, కొల్లూరి సంతోష్ కుమార్, రెండ్ల వేణు, బొడ్డుపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.