prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 6:14 pm Digital Edition : PRAJA VANI

రాత్రికి రాత్రే మారిన రాజకీయ కండువాలు.. ముధోల్‌లో సర్పంచుల పార్టీ మార్పుల కలకలం

*రాత్రికి రాత్రే మారిన రాజకీయ కండువాలు.. ముధోల్‌లో సర్పంచుల పార్టీ మార్పుల కలకలం!*

*నిన్న గులాబీ కండువా.. నేడు కాషాయ కండువా! బీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రకటన.. మరుసటి రోజే బీజేపీలోనే ఉన్నామంటూ స్పష్టీకరణ.. స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పరిణామం*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 18:–
ముధోల్ నియోజకవర్గ రాజకీయాల్లో సర్పంచుల పార్టీ మార్పుల వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. నిన్నటి వరకు బీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రచారం.. మరుసటి రోజే తాము బీజేపీలోనే కొనసాగుతున్నామంటూ ప్రకటన! ఇలా కేవలం ఒక్కరోజు వ్యవధిలో రాజకీయ కండువాలు మారడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పార్టీ మార్పులు సహజమే అయినప్పటికీ, రాత్రికి రాత్రే చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రజల్లో పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తానూర్, కుభీర్ మండలాలకు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు బీఆర్ఎస్‌లో చేరినట్లు మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. ఈ చేరికలకు ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధి డాక్టర్ పి. రమాదేవి నేతృత్వం వహించారు. దీంతో నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేశాయి. అయితే ఈ పరిణామానికి మరుసటి రోజే మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. కుభీర్ మండలంలోని మాలేగాం సర్పంచ్ ఆనంద్, పల్సి సర్పంచ్ సత్యవ్వ రాములు తనూర్ మండల్ జావుల, బి. సర్పంచ్ శేష రావు
తొండల సర్పంచ్ మధోరావు. తాము బీజేపీ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. బుధవారం భైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకుని తమ వైఖరిని వెల్లడించారు.
కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మెప్పు పొందేందుకు తమను తప్పుదోవ పట్టించి హైదరాబాద్‌కు తీసుకెళ్లారని వారు ఆరోపించారు. అనుకోకుండా జరిగిన పరిణామమే తప్ప పార్టీ మారాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ నాయకుల సహకారంతోనే తాము సర్పంచులుగా గెలిచామని, గ్రామ అభివృద్ధికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఆయనకే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బీజేవైఎం రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్ స్పందిస్తూ, సర్పంచులకు మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించడం సరైన రాజకీయ పద్ధతి కాదని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరినట్లు ప్రకటించడం రాజకీయ వేడిని మరింత పెంచింది.

*కండువాలు మారాయా.. కేవలం ప్రకటనలే మారాయా?*

ఒకే సంఘటనపై రెండు రాజకీయ పార్టీలు భిన్నమైన ప్రకటనలు చేయడం, ఒకరోజు గులాబీ కండువాలతో కనిపించిన నాయకులు మరుసటి రోజు కాషాయ కండువాలతో ప్రత్యక్షం కావడం ముధోల్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు? ఎవరి చేరిక నిజం? ఎవరి ప్రకటన రాజకీయ వ్యూహం? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
గ్రామస్థాయిలో ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచులు అభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ పార్టీల కండువాల చుట్టూ తిరుగుతారా? అన్న చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా ముధోల్ నియోజకవర్గంలో ఒక్కరోజు వ్యవధిలో చోటుచేసుకున్న ఈ రాజకీయ కండువాల మార్పు వ్యవహారం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.