prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 7:15 pm Digital Edition : MAHESH MEDCHAL

మైత్రి ఫెర్టిలిటీ సెంటర్‌లో వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు.. స్కానింగ్ యంత్రం సీజ్

*మైత్రి ఫెర్టిలిటీ సెంటర్‌లో వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు.. స్కానింగ్ యంత్రం సీజ్

*నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు షోకాజ్ నోటీసులు జారీ*

మేడ్చల్, నవంబర్ 18:
మైత్రి ఫెర్టిలిటీ సెంటర్‌పై అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు చట్టాలు, నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సెంటర్‌లో టారిఫ్ వివరాలు, వైద్యుల అర్హతలకు సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా ప్రదర్శించకపోవడం, సిబ్బంది వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం, సిబ్బంది అర్హతలపై అనుమానాలు వ్యక్తం కావడం, ఏఆర్టీ చికిత్సలకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ రికార్డుల్లోనూ పలు వ్యత్యాసాలు గుర్తించారు. పీసీపీఎన్డీ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా సెంటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వైద్య సేవలు అందించే సంస్థలు సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ గీత ప్రసాద్, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ నాగరాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత, వైద్యాధికారి డాక్టర్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.