మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
— అవసరమైతే సీఎం వద్దకు వెళ్లడానికైనా, ఉద్యమానికైనా సిద్ధం
— మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 18
మిర్యాలగూడ
మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, మాజీ శాసనసభ్యులుగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి స్పష్టం చేశారు.
జిల్లా సాధన సమితి నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసి, ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు అనేది అత్యంత న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు.
నాటి రాజకీయ వైరుధ్యాలతోనే జాప్యం:
గతంలోనే మిర్యాలగూడను జిల్లా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, అయితే నాటి రాజకీయ వైరుధ్యాల కారణంగా జిల్లా ఏర్పాటులో మిర్యాలగూడ వెనుకబడిన మాట వాస్తవమేనని వారు అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, వెంటనే మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధికి బాటలు:
మిర్యాలగూడ జిల్లాగా ఏర్పడితే పరిసర ప్రాంతాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అంతేకాకుండా రైతులు, కార్మికులకు జిల్లా కేంద్రానికి వెళ్లే వ్యయప్రయాసలు తగ్గుతాయని తెలిపారు.
పాలకపక్ష నేతలు చొరవ చూపాలి:
జిల్లా ఏర్పాటు కోసం ప్రస్తుత మిర్యాలగూడ ఎమ్మెల్యే, ఎంపీ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ విషయంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, జిల్లా సాధన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకు రావడానికైనా, ప్రత్యక్ష ఉద్యమాలు చేయడానికైనా తాము వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు తమ్ముడబోయిన అర్జున్, మాలోతు దశరథ నాయక్, దాసరాజు జయరాజు, తిరుమలగిరి అశోక్, ఎండీ షోయబ్, సర్నాల వెంకయ్య యాదవ్, మహమూద్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.